యూట్యూబ్‌లో ఉన్న వీడియోలలో ఒక మిలియన్ వ్యూస్ వస్తే చాలు.. వీడియో సూపర్ సక్సెస్ అయింది అని అనుకుంటాం. ఒక కోటి వ్యూస్ వస్తే.. ఇక మన వీడియోకు తిరుగులేదు అనుకుంటాం. కానీ.. ఈ వీడియోకు వచ్చిన వ్యూస్ ఎన్నో తెలిస్తే నోరెళ్లబెడతారు. వెయ్యి కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ వీడియోకు. యూట్యూబ్ భాషలో చెప్పాలంటే.. 10 బిలియన్ వ్యూస్ అన్నమాట. ఇంతకీ ఏంటా వీడియో.. ఏముంది ఆ వీడియోలో అంటారా? అది పిల్లలకు సంబంధించిన వీడియో.
బేబీ షార్క్ సాంగ్ అది. జూన్ 2016లో ఆ వీడియోను యూట్యూబ్‌లో కొరియాకు చెందిన
Pinkfong Baby Shark – Kids’ Songs & Stories అనే చానెల్లో అప్లోడ్ చేశారు. నవంబర్ 2020లో కేవలం 2.17 నిమిషాలు ఉన్న ఆ వీడియో 7 బిలియన్ వ్యూస్‌తో గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. అప్పుడు కూడా అదే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో. తాజాగా దానికి 10 బిలియన్ వ్యూస్ వచ్చాయి. 1000 కోట్లు అంటే ప్రపంచ జనాభా కంటే కూడా ఎక్కువ అన్నమాట. అంటే.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఒక్కసారైనా చూసి ఉంటారు. యానిమేషన్‌తో ఇద్దరు పిల్లలను సరదాగా ఆడించే వీడియో అది. అయితే.. అందులో పిల్లలు పాడే పాట చాలా క్యాచీగా ఉండటంతో పిల్లలంతా ఆ పాటను ఎంతో ఇష్టపడ్డారు. దాని వల్ల ఆ వీడియోకు అత్యంత ఎక్కువ వ్యూస్ వచ్చాయి.