హెల్సింకి: ఫిన్‌ల్యాండ్‌కు చెందిన మహిళా ఎంపీ అన్నా కొంటులా(MP Anna Kontula) సంచలన విషయాన్ని వెల్లడించారు. 16 ఏళ్ల వయసులోనే శరీరాన్ని అమ్ముకున్నట్లు ఆమె చెప్పారు. తన గతాన్ని చెప్పుకోవడానికి తానేమీ ఇబ్బందిపడడం లేదన్నారు. వేశ్యావృత్తి నుంచి తాను రాజకీయ కెరీర్ వైపు మళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. హెల్సింగిన్ సనోమాట్ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిన్‌ల్యాండ్ పార్లమెంట్‌కు నాలుగు సార్లు ఎంపికైన ఆమె వయసు ప్రస్తుతం 48 ఏళ్లు. చాన్నాళ్ల నుంచి సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఆమె పోరాటం చేస్తున్నారు.
టీనేజ్లోనే రెండేళ్ల పాటు సెక్స్ వర్కర్‌గా చేసినట్లు ఎంపీ అన్నా కొంటులా తెలిపారు. విద్యాభ్యాసం కొనసాగిస్తూనే 16 ఏళ్ల వయసు తన అవసరాల కోసం శరీరాన్ని అమ్ముకున్నట్లు చెప్పారు. ఆర్థిక సమస్యలు, ఆసక్తి వల్ల తాను సెక్స్ వర్కర్ వృత్తిలో కొన్నాళ్లు ఉండాల్సి వచ్చిందన్నారు. అవసరాలు తీరడం కోసం ఇదే తనకు మార్గమైందన్నారు. బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత వేశ్యా వృత్తిని వదిలేసినట్లు చెప్పారు. అయితే వేశ్యా హక్కుల కోసం మాత్రం ఆమె కొన్ని దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్నారు. 2002లో ఆమె సెక్స్ వర్కర్ల సంఘాన్ని ఏర్పాటు చేశారు. వ్యభిచారానికి వ్యతిరేకంగా ఫిన్‌ల్యాండ్ 2006లో చట్టాన్ని తయారు చేసింది.
ఎంపీ అన్నా కొంటులా 2011 నుంచి పార్లమెంట్‌కు ఎంపికవుతున్నారు. సెక్స్ వర్క్ టాపిక్‌పై స్వరం విప్పడం వల్ల సోషల్ డిబేట్లో దాని లాభాల గురించి మాట్లాడుకోవచ్చు అని ఆమె పేర్కొన్నారు. ఎంపీ కొంటులా చేసిన వ్యాఖ్యలను లీగల్ సైకాలజిస్ట్ పియా పులొక్క తప్పుపట్టారు. సెక్స్ వర్క్‌ను ఇతర పనితో పోల్చడం సరికాదన్నారు. వేశ్యావృత్తిని సాధారణమైందిగా భావించడం వల్ల సమాజంలో స్వేచ్చ రాదు అని ఆయన అన్నారు. నాగరిక సమాజంలో ఎవరు కూడా తమ రహస్య జీవితాన్ని అమ్ముకోవద్దు అన్నారు.