Russia | బ్రస్సెల్స్, ఏప్రిల్ 4: నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ మంగళవారం చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యాతో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం కీలక పరిణామమని పరిశీలకులు భావిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ చేతుల్లో ఓటమి తర్వాత ఫిన్లాండ్ ఏ సైనిక కూటమిలోనూ చేరకుండా తటస్థ వైఖరితో వ్యవహరిస్తున్నది. అయితే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాతో తమకు కూడా ముప్పు ఉండొచ్చని ఫిన్లాండ్ భావించింది. తన వైఖరి మార్చుకొని నాటో కూటమిలో చేరేందుకు నిర్ణయించుకొని గత మే నెలలో దరఖాస్తు చేసుకుంది.
నాటోలో ఫిన్లాండ్ చేరడంపై రష్యా ఘాటుగా స్పందించింది. దీనిని తమ దేశ భద్రతపై దాడిగా భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామం తమ భద్రతకు ఏర్పడతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ప్రతీకార చర్యలకు పాల్పడేటట్టు చేస్తున్నదని పేర్కొంది. ఫిన్లాండ్కు నాటో అదనపు దళాలు లేదా యుద్ధ సామాగ్రిని పంపితే తామూ ఫిన్లాండ్ సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచుతామని మాస్కో హెచ్చరించింది. కాగా, ఫిన్లాండ్ పార్లమెంటు వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. నాటోలో ఫిన్లాండ్ చేరినందునే హ్యాక్ చేశామని ఓ రష్యా అనుకూల హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది.
ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరడం రష్యాకు భారీ ఎదురుదెబ్బ. తమ సరిహద్దులకు నాటో విస్తరిస్తుండటాన్ని రష్యా మొదటి నుంచి ఆక్షేపిస్తున్నది. ఉక్రెయిన్పై దాడికి కూడా ఇదే కారణాన్ని చూపించింది. ఇప్పుడు నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరికతో రష్యాతో నాటో కూటమికి ఉన్న సరిహద్దు దాదాపుగా రెట్టింపు అయ్యింది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.