Execution: ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడిన కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉగ్రవాదులను ఇరాన్ సోమవారం ఉరితీసింది. డాన్ సిటీలో నలుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 2022 జూలైలో ఇరాన్ భద్రతా బలగాలు ఈ నలుగురిని అరెస్టు చేశాయి.
పలు దఫాల విచారణ అనంతరం 2023 సెప్టెంబర్ 18న కోర్టు ఈ నలుగురికి ఉరిశిక్షలు విధించింది. ఇరాన్ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన కేసులో కూడా ఈ నలుగురు దోషులుగా ఉన్నారు. కాగా, గత నెలలో కూడా ఇరాన్ ఒక మహిళ, నలుగురు పురుషులను ఉరితీసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అనుకూలంగా పనిచేసిన కేసులో వీరు దోషులుగా తేలారు.
డిసెంబర్ ఆరంభంలో కూడా కీలక సమాచారాన్ని మొస్సాద్‌కు చేరి వేశాడన్న ఆరోపణలపై ఒక వ్యక్తికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు గత కొన్నేళ్లుగా గూఢచర్యానికి సంబంధించి ఒకరినొకరు నిందించుకుంటూ వస్తున్నారు. ఏళ్ల తరబడి రెండు దేశాల మధ్య ఈ షాడో యుద్ధం కొనసాగుతూనే ఉంది.