వాషింగ్టన్: అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ (Osama Bin Laden)ను హతమార్చినట్లు చెప్పుకున్న అమెరికా మాజీ నేవీ సీల్ రాబర్ట్ ఓనీల్‌ను ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్సాస్‌లో గత వారం ఒక వ్యక్తిపై ఆయన దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో గత బుధవారం ఫ్రిస్కోలో కేసు నమోదు కావడంతో రాబర్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 3,500 డాలర్ల బాండ్‌తో అదే రోజున ఆయనను విడుదల చేశారు. అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2016లో కూడా నీల్‌పై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు కాగా, దాని నుంచి ఆయన బయటపడినట్లు పేర్కొన్నాయి.
కాగా, 2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడికి సూత్రధారి అయిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. 2011లో పాకిస్థాన్‌లోని రహస్య ప్రాంతంలో దాక్కున బిన్ లాడెన్ స్థావరంపై దాడి చేసి అతడ్ని హతమార్చాయి. అయితే లాడెన్‌పై స్వయంగానే తాను కాల్పులు జరిపి చంపినట్లు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా మాజీ నేవీ సీల్ రాబర్ట్ ఓనీల్ వెల్లడించారు. 2017లో ‘ది ఆపరేటర్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే దీనిని ఖండించలేదు.