న్యూడిల్లీ, మార్చి 15: ఏ పనీ చేయకుండా 10 రోజుల పాటు అలా పడుకుంటే మీకు సుమారు రూ.4.72 లక్షలు (5 వేల యూరోలు) ఇస్తామంటూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఆఫర్ ఇచ్చింది. వాటర్ బెడ్‌పై పది రోజులపాటు పడుకోబెట్టి వీరిని పరీక్షించనున్నారు. అంతరిక్షయానంలో మానవ శరీరంపై పడే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు.
ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లోని మెడెస్ స్పేస్ క్లినిక్‌లో ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఇందులో భాగంగా బాత్‌టబ్‌ల మాదిరి ఉండే కంటైనర్లలో పది మందిని పడుకోబెట్టారు. వీటిని వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో కవర్‌చేశారు. దీంతో వారికి తడి అంటదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తేలియాడినట్టుగానే వీరు కూడా అదే అనుభూతి పొందుతారు.
బాత్రూమ్, ఇతర అవసరాలకు వలంటీర్లను తాత్కాలికంగా ట్రాలీలోకి బదిలీ చేస్తారు. అయితే వారు అప్పుడు కూడా వెనక్కి వాలిన పొజిషన్లోనే ఉండాలి. అయితో భోజన సమయంలో ఫ్లోటింగ్ బోర్డు, నెక్ పిల్లోను సమకూరుస్తారు. వారు తమ ఫోన్లను తమతోనే ఉంచుకోవచ్చు. కావాల్సిన వారితో మాట్లాడవచ్చు. పది రోజుల తర్వాత వారి శారీరక స్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు.