లండన్ : రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్‌తో కలసి బ్రిటన్, ఫ్రాన్స్ శాంతి ఒప్పందాన్ని రూపొందిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆదివారం వెల్లడించారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమర్పిస్తామని ఆయన ప్రకటించారు. ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్‌ల వాగ్యుద్ధం నేపథ్యంలో ఇదే సరైన దిశలో సరైన చర్యగా ఆయన అభివర్ణించారు. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు మార్గాన్ని కనుగొనేందుకు యూరోపియన్ యూనియన్‌కు చెందిన డజను మందికిపైగా నాయకులు లండన్‌లో శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో స్టార్మర్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ నాయకులంతా కలసికట్టుగా దీని కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైట్ హౌస్‌లో ఇటీవల జెలెన్స్కీ, ట్రంప్ మధ్య జరిగిన వాగ్యుద్ధం వంటి సన్నివేశాలను చూడాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ దేశాలు ఏకతాటిపైకి వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ దండెత్తకుండా పుతిన్‌ను నివారించాల్సిన బాధ్యత ట్రంప్‌పై ఉందన్నారు.