బ్రసెల్స్, మార్చి 4: యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు మంగళవారం ఈయూ కార్యనిర్వాహక అధిపతి 800 బిలియన్ యూరోలతో (దాదాపు రూ.73, 29,538 కోట్ల)తో భారీ ప్రణాళికను ప్రతిపాదించారు. అమెరికా విరమణ వల్ల యూరప్‌పై పడే ప్రభావాన్ని తగ్గించడంతోపాటు ఉక్రెయిన్‌కు సైనిక బలాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ భారీ ప్రణాళికను ఈయూలోని 27 సభ్య దేశాల నేతల ముందు ఉంచుతామని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేయాలని మంగళవారం ఉదయం ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఆమె ఈ ప్రణాళికను తెరపైకి తీసుకురావడం గమనార్హం. వాషింగ్టన్ నుంచి రాజకీయ అనిశ్చితి పెరుగడంతోపాటు యూరప్‌తో పొత్తును, ఉక్రెయిన్ రక్షణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించిన నేపథ్యంలో ఈయూ నేతలు గురువారం బ్రసెల్స్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. దశాబ్దాల నుంచి అమెరికా అణు ఛత్రం కింద కొనసాగుతున్న ఈయూ దేశాలు ఆర్థిక మందగమనం వల్ల రక్షణ రంగానికి అధిక మొత్తంలో నిధులు వెచ్చించని విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు రక్షణ వ్యయాన్ని వేగంగా పెంచాల్సి రావడం ఆ దేశాలకు సమస్యాత్మకంగా మారనున్నది.