దుబాయ్: ప్రపంచ మంతటా క్రిస్మిస్ సందడి నెలకొన్నది. జనం కూడా ఈ పండగ మూడ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కూడా క్రిస్మిస్ హాలిడే మూడ్‌లోకి వచ్చింది. ఆ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానాన్ని శాంటా క్లాజ్‌గా తీర్చిదిద్దింది. ఆ విమానాన్ని రెయిన్ డీర్లు లాగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. క్రిస్మస్ సెలవుల్లో సురక్షితమైన ప్రయాణం, సహనం వంటి సానుకూల అంశాలకు సంకేతమైన శాంటా క్లాజ్‌ను గుర్తు చేసింది.
కాగా, ఆ విమానం ముందు భాగంపైన శాంటా క్లాజ్ టోపీ మాదిరిగా ఎమిరేట్స్ సంస్థ ఏర్పాటు చేసింది. రెయిన్ డీర్లు దానిని ఆకాశంలోకి లాగుతున్నట్లుగా ఉన్న వీడియో క్లిప్ ఎంతో ఆకట్టుకుంటున్నది. ‘కెప్టెన్ క్లాజ్, టేకాఫ్ కోసం అనుమతి కోరుతున్నారు’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మెర్రీ క్రిస్మస్ ఫ్రమ్ ది ఎమిరేట్స్’ అని విష్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు ఐదు లక్షల మంది ఈ వీడియో క్లిప్‌ను వీక్షించారు.