Starlink satellite : టెస్లా అధినేత (Tesla chief) ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన స్టార్‌లింక్ ప్రాజెక్టు (Star link Project) లోని ఉపగ్రహాల్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపుతప్పి భూమివైపు వస్తున్నది. ఈ నెల 17న భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ‘శాటిలైట్ 35956’ హఠాత్తుగా అక్కడి నుంచి జారిపోవడం మొదలైంది. స్పేస్ఎక్స్ (SpaceX) దానిపై నియంత్రణ కోల్పోయింది.
ఆ తర్వాత ఆ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. ‘హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్ ట్యాంక్‌లో గ్యాస్ అత్యంత శక్తిమంతంగా బయటకు వెలువడింది. దాంతో ఒక్కసారిగా అది నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని భాగాలుగా విడిపోయి మెల్లగా జారుతున్నాయి. వారం రోజుల్లోగా అవి భూవాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు’ అని స్పేస్ఎక్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
శనివారం ఆ ఉపగ్రహానికి సంబంధించిన శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా.. వెంటోర్‌టెక్ సంస్థకు చెందిన వరల్డ్‌వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హైరిజల్యూషన్ చిత్రాలను తీసింది. ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎలాంటి ముప్పు లేదని స్పేస్ఎక్స్ చెబుతోంది. ప్రస్తుతం అది ఐఎస్ఎస్ కంటే కిందే ఉందని వెల్లడించింది.
అది లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉండటంతో భూగురుత్వాకర్షణ శక్తి దానిని సులువుగా లాగేస్తుందని తెలిపింది. అవి వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టార్‌లింక్ ప్రాజెక్టు కింద 9,000 ఉపగ్రహాలను స్పేస్ఎక్స్ అంతరిక్షంలోకి పంపింది. దాంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను సరఫరా చేయగలుగుతోంది.