న్యూయార్క్: ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంస్థకు సంబంధించిన వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకొంటారోనని ఉద్యోగులు భయపడుతున్నారు. ఇప్పటికే కీలక ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్ ప్రీమియం పెంచిన మస్క్.. ఆయన తీసుకొన్న మరో నిర్ణ యం తాజాగా సంచలనంగా మారింది. కొత్త నిర్ణయాలకు అనుగుణంగా రోజుకు 12 గంటలు పనిచేయాలని, మార్పులను డెడ్‌లైన్‌లోగా అమల్లోకి తెచ్చేందుకు వారంలో ఏడు రోజులూ సెలవు లేకుండా పనిచేయాలని కొంతమంది ఇంజినీర్లను ఆదేశించారట.
ఈ మేరకు సంస్థలో అంతర్గత ఆదేశాలు వెళ్లాయని సీఎన్‌బీసీ నివేదించింది. నవంబర్ 7లోగా కొత్త బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీచర్‌ను లాంచ్ చేయాలని, లేకుంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని మస్క్ ఇంజినీర్లను ఆదేశించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఇతర టాస్క్‌లకు కూడా ఇటువంటి డెడ్లైన్లు విధించారని తెలిపాయి. ట్విట్టర్‌ను మస్క్ టేకోవర్ చేసిన తర్వాత తొలగింపుల అంశం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తున్నది. ఉద్యోగులపై భారీగా వేటు పడునున్నదన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగులు కూడా మస్క్ ఆదేశాలకు అనుగుణంగా తప్పక పనిచేస్తున్నారని సీఎన్‌బీసీ పేర్కొన్నది.