శాన్ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ లోగోను మార్చేశారు ఎలాన్ మస్క్. పక్షిని తొలగించి డోజీ బొమ్మను పెట్టారు. జపాన్‌కు చెందిన షిబా ఇను అనే జాతి కుక్కనే డోజీ అంటారు. దీని పేరు మీద డోజీకాయిన్ అనే క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. గతంలో ఈ క్రిప్టో కరెన్సీకి మస్క్ అనుకూలంగా ట్వీట్లు చేసి దాని విలువ పెంచే ప్రయత్నం చేశారు.
ట్విట్టర్ లోగోను మార్చడానికి కూడా ఇదే కారణమని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే, గతంలో ఒక ట్విట్టర్ యూజర్ ట్విట్టర్‌ను కొని పక్షి లోగోను తీసేసి డోజీని పెట్టాలని మస్క్‌కు సూచించారట. ఈ సూచన మేరకే ఇప్పుడు లోగో మార్చినట్టు మస్క్ ప్రకటించారు. సదరు యూజర్ గతంలో చేసిన ట్వీట్ల స్క్రీన్షాట్లను కూడా మస్క్ ట్వీట్ చేశారు. కాగా, కొత్త లోగో శాశ్వతంగా ఉంటుందా, మళ్లీ మార్చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.