Elon Musk | వాషింగ్టన్: అమెరికాలో ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు మధ్య చిచ్చును మరింత రాజేస్తున్నది. ఈ బిల్లుపై ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన ‘బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు ఆమోదం పొందితే ఆ మరుసటి రోజే దేశంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని టెస్లా కంపెనీ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
దీనిపై స్పందించిన ట్రంప్ తాము ఇస్తున్న సబ్సిడీలకు కోత విధిస్తే మస్క్ తన దుకాణం మూసుకొని తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే తన సబ్సిడీలకు కోత విధించాలని మస్క్ సవాల్ చేశారు. ఇప్పుడు గనుక ఆ బిల్లు ఆమోదం పొందితే బిల్లుకు మద్దతునిచ్చిన సెనేట్ సభ్యులందరినీ వచ్చే ఎన్నికల్లో పదవీచ్యుతులను చేస్తానని బెదిరించారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు మూలంగానే ట్రంప్‌కు, టెస్లా అధినేతకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ బిల్లుపై తాజాగా సెనేట్‌లో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సెనేట్ సభ్యులకు వ్యతిరేకంగా తన ఎక్స్ ఖాతాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. ఈ బిల్లుతో అమెరికన్ల రుణ భారం పెరుగుతుందని, దీనికి ప్రజామోదం లేదని తెలిపారు. ఇది అత్యంత మూర్ఖపు బిల్లు అని వ్యాఖ్యానించారు. ‘ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే అమెరికన్ పార్టీ ఆవిర్భవిస్తుంది.
డెమోక్రాట్-రిపబ్లికన్ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల గొంతును వినిపించే ఓ కొత్త ప్రత్యామ్నాయం అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసిన రిపబ్లికన్లు ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతునిస్తున్నారని వారంతా సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల దేశ రుణభారం మరింత పెరుగుతుందని మస్క్ ఆందోళన చెందుతున్నారు.
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టెస్లా కంపెనీ అధినేత దుకాణం మూసుకొని తన మాతృదేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘నేను విద్యుత్తు వాహనాల వినియోగానికి వ్యతిరేకమని ఆయనకు తెలుసు. విద్యుత్తు కార్లు మంచివే.. కానీ అందరూ ఆ కార్లను కొనాలని బలవంతం చేయవద్దు. చరిత్రలో ఏ మానవుడూ పొందనంత సబ్సిడీని మస్క్ పొందుతున్నారు. ఆ సబ్సిడీలు లేకపోతే.. ఆయన దుకాణం మూసుకొని దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి వస్తుంది’ అని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ‘రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా విద్యుత్తు కార్ల ఉత్పత్తి ఉండదు, మన దేశానికి ఎంతో ధనం మిగిలిపోతుంది’ అని మరో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మస్క్.. దమ్ముంటే తన కంపెనీలకిస్తున్న సబ్సిడీలను కత్తిరించాలని సవాల్ చేశారు.