Yoga Solar PC | బార్సిలోనా: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రాస్లిమ్ సోలార్ పవర్ ఆధారిత ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యోగా సోలార్ పీసీ’గా పిలుస్తున్న దీన్ని 20 నిమిషాల పాటు సోలార్ చార్జింగ్ చేస్తే సుమారు గంట పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఆధారిత టెక్నాలజీకి ఇది ఊతమివ్వనున్నది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’లో దీన్ని లెనోవో ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే మొదటి అల్ట్రాస్లిమ్ సోలార్ పీసీగా ఆ కంపెనీ అభివర్ణించింది.
లెనోవో అభివృద్ధి చేసిన ఈ ల్యాప్‌టాప్ వెలుపలి భాగంలో ఉండే లిడ్ (రిమూవబుల్ కవర్)లో సోలార్ ప్యానెల్ అమర్చి ఉంటుంది. ఇందులో 84 బ్యాక్ కాంటాక్ట్ సోలార్ సెల్స్ ఉంటాయి. ఈ డిజైన్ సూర్యకాంతి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కన్వర్షన్ రేటు 24 శాతం కలిగి ఉంటుంది. ఇది సిలికాన్ ఆధారిత సంప్రదాయ ప్యానెల్ కంటే అధికం. ఇది అవుట్డోర్తోపాటు ఇన్‌డోర్‌లోనూ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఉన్న ‘యోగా ల్యాప్‌టాప్’కు సోలార్ పవర్ కిట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నది.
ఫిన్లాండ్ కేంద్రంగా ఉన్న మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ హెచ్ఎండీ కిడ్స్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసింది. ‘ఫ్యూజన్ ఎక్స్1’గా పిలుస్తున్న దీన్ని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది. పేరెంటల్ కంట్రోల్ ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. యాప్‌లలో లిమిట్ సెట్ చేసుకోవడం, స్క్రీన్ టైమ్ షెడ్యూల్, ప్రతి 20 సెకండ్లకు పిల్లల లొకేషన్‌ను ట్రాక్ చేసే వెసులుబాటు ఈ ఫోన్లో ఉండటం విశేషం. సబ్స్క్రిప్షన్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పిల్లల భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది.