Earth | న్యూయార్క్, జూన్ 14: భూభ్రమణం నెమ్మదించిందా ? ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండటం వల్ల భూభ్రమణం నెమ్మదించిందని, ఇది సమయంపై ప్రభావం చూపబోతున్నదని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఇందుకు సంబంధించి కొత్త విషయం చెప్పారు.
భూమి ఉపరితలంతో పోలిస్తే అంతర్భాగం(ఇన్నర్ కోర్) భ్రమణం మందగించిందని వీరు ఒక అధ్యయనంలో తేల్చారు. ఇనుము, నికెల్‌తో కూడి భూమి ఇన్నర్ కోర్ భ్రమణం చాలా దశాబ్దాల తర్వాత 2010 నుంచి మందగించిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డంకన్ అగ్న్యూ తెలిపారు. ఫలితంగా రోజు నిడివిలో సెకనులో ఒక భాగం మేర మారొచ్చని పేర్కొన్నారు. భూకంపాల ద్వారా సంభవించే తరంగాలపై చేసిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.