లండన్: సుమారు 26 వేల మంది ఖైదీలను బ్రిటన్ సర్కారు వదిలేసింది(Prisoners Released). జైళ్లలో సరిపోను స్థలం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రధాని స్టార్మర్ .. సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటికే బ్రిటన్ జైళ్లలో ఉన్న సుమారు 26 వేల మంది ఖైదీలు రిలీజైనట్లు ఓ కథనం ద్వారా తెలుస్తోంది. సుదీర్ఘ కాల శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఫ్రీ అయినట్లు వెల్లడించారు. ఖైదీలతో జైళ్లు నిండిపోయాయని, జైళ్లను ఫ్రీగా మార్చాలన్న ఉద్దేశంతో సాఫ్ట్ జస్టిస్ ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టినట్లు ప్రధాని స్టార్మర్ ఇటీవల తెలిపారు. ప్రభుత్వ డేటా ప్రకారం సెప్టెంబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు 14 ఏళ్లకుపైగా శిక్ష పడిన సుమారు 248 మంది జైళ్ల నుంచి రిలీజయ్యారు. విడుదలైన ఖైదీల్లో 2600 విదేశీయులు కూడా ఉన్నారు.
స్టార్మర్ ప్రభుత్వ స్కీమ్ కింద ప్రతి నెల సగటున 3461 మందిని రిలీజ్ చేస్తున్నారు. 40 శాతం శిక్షను అనుభవించిన ఖైదీలను ఎక్కువగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఏడాది కాలం పూర్తి అయ్యేలోగా దాదాపు 45 వేల మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజైన ఖైదీలు ప్రధాని స్టార్మర్‌కు థ్యాంక్స్ తెలిపారు. జీవితకాలం లేబర్‌పార్టీ ఓటర్లుగా మిగిలిపోతామన్నారు. కానీ కొందరు ఖైదీలు రిలీజైన వెంటనే మళ్లీ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
జైళ్లలో రద్దీని తగ్గించేందుకే ఖైదీలను విడుదల చేస్తున్నట్లు న్యాయశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొత్తగా 14 వేల జైళ్లను నిర్మిస్తున్నామని, జైళ్లలో స్థలం ఖాళీ ఉండే రీతిలో ప్లాన్ వేస్తున్నట్లు చెప్పారు.