వాషింగ్టన్, నవంబర్ 27: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగాలి. ఆరో గ్య నిపుణులు సాధారంగా 8 సార్లు 8 ఔన్స్ గ్లాసుల చొప్పున నీళ్లు తాగాలని సిఫారసు చేస్తారు. దీనినే 8×8 సూత్రం అంటారు. అంటే రోజుకు 2 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలి. అయితే, ఈ సూత్రం అందరికీ వర్తించదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి ఇతర పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా నీరు చేరుతుందని, మళ్లీ అదనంగా నీళ్లు తీసుకొంటే ముప్పేనని అమెరికా పరిశోధకులు గుర్తించారు.
26 దేశాలకు చెందిన 8 రోజుల నుంచి 96 ఏండ్ల వయసున్న 5,600 మందిపై అధ్యయనం నిర్వహించారు. వారు రోజులో సరాసరి ఒక లీటరు నుంచి 6 లీటర్ల నీళ్లు తాగుతున్నట్టు తేల్చారు. ఉష్ణోగ్రత, తేమ, నివసించే ప్రాంతం, శక్తి వినియోగం, శరీర బరువు, వయస్సు, శారీరక శ్రమ లాంటి కారకాలు నీటి వినియోగంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. వ్యవసాయ ఆధారిత దేశాల్లోని ప్రజలు పారిశ్రామిక దేశాల్లోని ప్రజలకంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నట్టు గుర్తించారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా నీళ్లు తాగుతున్నట్టు తెలిపారు. అందరికంటే ఎక్కువగా శిశువులు నీళ్లు తాగుతున్నారని, రోజూ వారి శరీరంలోకి 28శాతం నీళ్లు చేరుతున్నట్టు కనుగొన్నారు.