New Zealand | వెల్లింగ్టన్, మే 24: ఒక డబ్బా.. అందులో ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదిత అంశాలు రాసి వేసిన చీటీలు.. ఆ డబ్బాల్లోంచి లక్కీ డిప్ తరహాలో కొన్ని చీటిలు బయటకు తీత.. ఆ చీటీల్లో ఉన్న అంశాలపైనే చర్చించి చట్టాల రూపకల్పన. ఇవీ.. న్యూజిలాండ్ పార్లమెంట్లో చోటుచేసుకునే దృశ్యాలు. అక్కడ ఏ అంశంపై చర్చ జరగాలన్నా లక్కీ డిప్ తరహాలో బిస్కట్ టిన్గా వ్యవహరించే ఒక డబ్బా నిర్ణయిస్తుందంటే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విధానం ద్వారా పార్లమెంట్లోని ప్రతి లెజిస్లేచర్కు ఒక అవకాశం లభిస్తుంది.
దీని నుంచి యాదృచ్ఛికంగా తీసిన చీటీల ద్వారా చట్టాలు రూపొందుతాయి. ప్రజాదరణ లేని సభ్యుడు కూడా తాను చెప్పే ప్రతిపాదిత చట్టాన్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం కల్పించేదే ఈ మార్గం. ప్రతి శాసనసభ్యుడి ప్రతిపాదనకు అవకాశం కల్పించాలన్న ఆలోచనతో పాటు, ప్రజాదరణ లేని సభ్యుడు కూడా తాను చెప్పే ప్రతిపాదిత చట్టాన్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం కల్పించేందుకే ఈ డబ్బా ఆచారాన్ని ప్రారంభించారు.
సమావేశాలు ప్రారంభం కాగానే అద్దాల పెట్టెలోని డబ్బాను వెలికి తీస్తారు. అందులో చర్చించాల్సిన ప్రతిపాదిత అంశాలకు సంబంధించిన చీటీలను వేస్తారు. అందులోంచి ఏ చీటీని తీస్తే దానిపైనే చర్చలు జరుపుతారు. దేశంలో వివాహ సమానత్వ చట్టం, స్వచ్ఛంద కారుణ్య మరణాన్ని చట్టబద్దం చేసే ముఖ్యమైన చట్టాలు ఇలా తీసిన చీటీల ద్వారానే పార్లమెంట్లో బిల్లుగా మారాయి.