Donald Trump : హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల కోతలు విధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా తన చర్యను సమర్థించుకున్నారు. అంతేగాక హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల జాబితా కావాలని కోరాడు.
దాంతో సోషల్ మీడియాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓ ప్రచారం జోరందుకుంది. ట్రంప్ కుమారుడు బారన్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ సీటు నిరాకరించడం వల్లే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ట్రంప్ చిన్న కుమారుడు బారన్‌కు హార్వర్డ్, కొలంబియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు సీటు నిరాకరించడంతో ఆయన న్యూయార్క్ యూనివర్సిటీ (NYU) స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ చదవడానికి అడ్మిషన్ తీసుకున్నట్లు పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు యూనివర్సిటీలో సీటు ఇచ్చిన హార్వర్డ్.. బారన్‌కు మాత్రం నిరాకరించడంతో అందుకు ప్రతీకారంగానే ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కాగా ఆన్లైన్లో జరుగుతున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖండించింది. ఈ అంశంపై డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కార్యాలయం కూడా స్పందించింది. ట్రంప్ చిన్న కుమారుడు బారన్ అసలు హార్వర్డ్ యూనివర్సిటీకి దరఖాస్తే చేయలేదని వివరణ స్పష్టంచేసింది.