Donald Trump | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : వాణిజ్యాన్ని ఎరగా చూపి భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. సీజ్‌ఫైర్‌పై చర్చల్లో సైనిక చర్యలు తప్ప వాణిజ్యం ప్రస్తావనే రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రకటించిన గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ట్రంప్ మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ.. తనకు యుద్ధాలంటే ఇష్టం లేదన్నారు. అందుకే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక సీజ్ఫైర్ ఒప్పందానికి తాను మధ్యవర్తిత్వం వహించానని చెప్పారు.
‘ఈ ఒప్పందం కుదరడానికి నేను వాణిజ్యంను అస్త్రంగా వాడాను. యుద్ధం మానేసి వాణిజ్యం చేసుకోవాలని సూచించా. అణ్వాయుధాల వ్యాపారం చేయడం కాదు.. మీ దేశాలు అభివృద్ధి చెందేలా వాణిజ్య సంబంధాలు పెంచుకోండి అని చెప్పాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలకు శక్తివంతమైన, బలమైన, ఆలోచనాపరులైన, మంచి నాయకులు ఉన్నారని, తన మాటలు విని వారు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని తెలిపారు. లేకపోతే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోకు అభినందనలు తెలిపారు. ‘వాళ్లిద్దరిని మరింత దగ్గరికి తీసుకురాగలం.. ఇద్దరూ కలిసి మంచి డిన్నర్ చేసేలా ఒప్పించగలం’ అని భారత్, పాక్ ప్రధానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.