దుబాయ్, జూన్ 17: ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వెల్లడించారు. అయితే ఖమేనీ చావును ప్రస్తుతానికి తాము కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా బేషరతుగా లొంగిపోవాలని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కేవలం కాల్పుల విరమణను మాత్రమే తాను కోరుకోవడం లేదని, అంతకన్నా మెరుగైన పరిష్కారాన్నే తాను కోరుకుంటున్నానని ట్రంప్ ప్రకటించారు. జీ7 సదస్సును అర్ధాంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి కెనడా నుంచి వాషింగ్టన్కు తిరిగివస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాల్పుల విరమణ కన్నా మెరుగైనది అంటే అర్థమేమిటని విలేకరులు ప్రశ్నించగా ‘నిజమైన ముగింపు. కాల్పుల విరమణ కాదు. పూర్తిగా ముగింపు కావాలి’ అని ట్రంప్ వివరించినట్లు బీబీసీ తెలిపింది. ఇజ్రాయెల్‌కు సాయం అందచేయడంపై అమెరికా వైఖరి ఏమిటని ప్రశ్నించగా, ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, ఇరాన్ వద్ద మాత్రం అణ్వాయుధం ఉండరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ వెట్కాఫ్ వంటి సీనియర్ అమెరికన్ అధికారులను తాను పంపే అవకాశం ఉందని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ రానున్న రెండు రోజుల్లో మీరే చూస్తారని విలేకరులతో ఆయన అన్నారు.
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రస్తావిస్తూ ఇరాన్ రాజధానిలో నివసించే ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. టెహ్రాన్‌ను విడిచి వెళ్లిపోవాలని అక్కడి ప్రజలను ఎందుకు హెచ్చరించారని విలేకరులు ప్రశ్నించగా ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తన అభీష్టమని ఆయన చెప్పారు. తమ అణు కార్యక్రమంపై ఇరాన్ నేతలు ఒప్పందం చేసుకోవడానికి ముందుకు రావడానికి ఇష్టపడలేదని ట్రంప్ నిందించారు. వారితో మాట్లాడేందుకు ఇప్పుడు తనకు ఆసక్తి కూడా లేదని ఆయన అన్నారు. ఒప్పందం చేసుకోవలసిందిగా తాను చెప్పానని, అయినా వారు చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాల్పుల విరమణ కుదిర్చేందుకే తాను జీ7 సదస్సును అర్ధాంతరంగా వదిలి వెళుతున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. వైట్ హౌస్‌లోని సిట్యుయేషన్ రూములో తన సలహాదారులతో సమావేశం అవుతానని ఆయన వెల్లడించారు. దీంతో ఈ ఘర్షణలో అమెరికా ప్రత్యక్ష పాత్ర ఉండే అవకాశాన్ని ఈ పరిణామం సూచిస్తున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత ఉగ్రరూపం దాలిస్తే స్పందించడానికి వీలుగా ఆ ప్రాంతంలో అమెరికా తన యుద్ధనౌకలు, సైనిక విమానాలను సిద్ధంగా ఉంచింది.