న్యూయార్క్: హష్ మనీ చెల్లింపుల (Hush money) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) న్యూయార్క్ గ్రాండ్ జ్యూరి నేరాభియోగాలు మోపింది. 2016 ఎన్నికలకు ముందు ఓ పోర్న్‌స్టార్‌కు (Porn star) ట్రంప్ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రుజువయ్యాయి. ఈనేపథ్యంలో న్యూయార్క్‌లోని గ్రాండ్ జ్యూరీ (New York grand jury) ట్రంప్‌పై అభియోగాలు (Criminal charges) మోపింది. దీంతో అమెరికాలో నేరారోపణలు రుజువైన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. కాగా, ఈ అభియోగాలకు సంబంధించిన చార్జీలను మ్యాన్‌హట్టన్ జిల్లా అటార్నీకార్యాలయం ప్రస్తుతం సీల్డ్కవర్లో ఉంచినట్టు, త్వరలోనే వీటిని ప్రకటించనున్నట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో శృంగారం చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) ఆరోపించారు. ‘ఆ విషయాన్ని’ బయటపెట్టకూడదంటూ తనను బెదిరించిట్లు వెల్లడించారు. 2016 ఎన్నికలకు ముందు, ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్మార్టీ డేనియల్స్ చెప్పారు. ఆ తరువాత, ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఆరోపణలు నిజమేనంటూ ప్రకటించారు. ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డుల్లో ఈ మొత్తాన్ని ‘లీగల్ ఫీజు’ కింద చెల్లించినట్టు ఉందన్నారు. ఈ కేసులో ఐదేండ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతున్నది.
76 ఏళ్ల ట్రంప్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. వాటిల్లో ఇదీ ఒకటి. అయితే, ఇప్పటివరకూ ఏ కేసులోనూ నేరం రుజువు కాలేదు. తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు.. నేరం రుజువైనా ప్రచారం కొనసాగిస్తానని ప్రకటించారు.