లాస్ ఏంజెలెస్, జూన్ 8: అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా ఫెడరల్ అధికారులు చేపట్టిన దాడులతో లాస్ ఏంజెలెస్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రెండో రోజు కూడా కొనసాగాయి. శుక్రవారం లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ అధికారులు జరిపిన దాడులతో నగరమంతా అట్టుడికిన సంగతి తెలిసిందే. అయితే శనివారం కూడా నగరంలో అదే పరిస్థితులు కన్పించాయి. ఫెడరల్ అధికారులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నది.
స్థానికులకు విపక్ష డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవ్వడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో నిరసనకారులు ప్యాకింగ్ కార్డులు, కాంక్రీట్ వ్యర్థాలతో పాటు దొరికిన వస్తువులతో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పలు చోట్ల ఆందోళనకారులు కార్లను తగులబెడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంతో పాటు వారిని అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఒక వైపు అక్రమ వలసదారుల ఏరివేతపై లాస్ ఏంజెలెస్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గేదేలే అన్న తరహాలో వ్యహరిస్తున్నారు. అక్రమ వలసదారులను విడిచిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. 2 వేల మంది నేషనల్ గార్డ్స్‌ను మోహరించాలని అధికా రులను ఆదేశించారు. ఈ అరాచకానికి కారణం పెయిడ్ ట్రబుల్ మేకర్స్ అని ఆరోపించారు.
లాస్ ఏంజెలెస్ ఘటనను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. వలసదారుల గెంటివేతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, పోలీసులపై దాడికి ప్రయత్నించే ఆందోళనకారులకు జైలే గతి అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించారు.