Trump | న్యూయార్క్, నవంబర్ 6: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవితంలో వారసత్వ వ్యాపారవేత్తగా మొదలై అగ్రరాజ్యానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వరకు అనేక మలుపులు ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు ట్రంప్ అనేక న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. న్యూయార్క్ కోర్టు ఓ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. దోషిగా నిరూపితమైన ఏకైక అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.
ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే జూలైలో ట్రంప్‌పై మిల్వాకీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన చెవి నుంచి బుల్లెట్ దూసుకెళ్లినా, రక్తం ధారలు కారుతున్నా ట్రంప్ భయపడకుండా పిడికిలి బిగించడం రిపబ్లికన్లలో కసి, అమెరికన్లలో ఆయన పట్ల సానుభూతిని పెంచింది. ఆ తర్వాత మరోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఆయన మృత్యుంజయుడిగా నిలిచారు.
1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మేరి, ఫ్రెడ్ ట్రంప్ దంపతులకు ట్రంప్ జన్మించారు. తన తండ్రి స్థాపించిన వ్యాపార బాధ్యతలను 1971లో ట్రంప్ స్వీకరించి వృద్ధిలోకి తీసుకొచ్చారు. హోటళ్లు, రిసార్ట్లు, నివాస, వాణిజ్య భవనాలు, కాసినోలు, గోల్ఫ్ కోర్సులు ఇలా అనేక ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టారు. 2004లో ‘ది అప్రెంటీస్’ అనే రియాల్టీ షోలో పాల్గొని అమెరిక్లకు చేరువయ్యారు.
ట్రంప్ మొదట అథ్లెట్, మాడల్ ఇవానా జెల్నికోవాను వివాహం చేసుకొని 1990లో విడాకులు ఇచ్చారు. 1993లో ఆయన నటి మార్లా మాపిల్స్‌ను పెండ్లి చేసుకొని 1999లో విడాకులిచ్చారు. 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు. ట్రంప్‌నకు మొత్తం ఐదుగురు సంతానం.