వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నుంచి అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న వారి మధ్య ప్రైమరీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రిపబ్లికన్ ప్రైమరీల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. అయోవా, న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీల్లో ఘన విజయం సాధించిన ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్నారు.
త్వరలో జరగనున్న సౌత్ కరోలినా ప్రైమరీలోనూ ఆయనే హాట్ ఫేవరెట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తనతో పాటు ఈ ఎన్నికల్లో రన్నింగ్ మేట్‌గా ఉండాల్సిందిగా రాబర్జ్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను ట్రంప్ కోరినట్లు ప్రచారం జరుగుతున్నది. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ తనను అడినట్లు కెన్నెడీ కూడా ధృవీకరించారు. ఆ ఆఫర్‌తో తాను పొంగిపోయానని, అయితే ట్రంప్‌కు రన్నింగ్మేట్గా ఉండటంపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
కాగా, కెన్నెడీ జూనియర్ వ్యాఖ్యలపై ట్రంప్ సీనియర్ అడ్వైజర్ క్రిస్ లాసివిటా స్పందించారు. ట్రంప్ క్యాంపు నుంచి ఎవరూ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీని సంప్రదించలేదన్నారు. ఆయనను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయాల్సిందిగా ట్రంప్ అడిగినట్లు కెన్నెడీ చెప్పడం వంద శాతం ఫేక్ అని కొట్టిపారేశారు. కాగా, ఈ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్.. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సోదరుడు, అమెరికా మాజీ అటార్నీ జనరల్ అయిన రాబర్ట్ కెన్నెడీ తనయుడు.