Iran vs US : పాకిస్థాన్ (Pakistan) కు చెందిన ఎయిర్‌ఫీల్డ్స్‌లో ఇరాన్ (Iran) సైనిక విమానాలను రహస్యంగా దాచి ఉంచినట్లు అమెరికా మీడియా (US Media) లో సంచలన కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్.. ఒకవైపు అమెరికా-ఇరాన్ (USA-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తూనే మరోవైపు ఇరాన్ సైనిక విమానాలను దాచేందుకు తమ ఎయిర్‌ఫీల్డ్స్‌లో చోటు ఇచ్చిందనే వార్తలు వెలువడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల అమెరికా-ఇరాన్ ఘర్షణల సమయంలో ఇరాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్స్‌లో నిలిపి ఉంచేందుకు పాకిస్థాన్ రహస్యంగా అనుమతించిందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలను రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌లో నిలిపిఉంచారు. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సీ-130తో సహా పలు విమానాలు అక్కడ ఉన్నాయి. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక ఆస్తులను రక్షించుకోవడంలో భాగంగా ఇరాన్ ఇలా చేసి ఉండవచ్చని ఆ కథనాలు పేర్కొన్నాయి. అదేవిధంగా టెహ్రాన్‌కు చెందిన ఓ పౌర విమానాన్ని అఫ్గానిస్థాన్‌లో నిలిపిఉంచినట్లు అమెరికా మీడియా తన కథనాల్లో పేర్కొన్నది.
అయితే పాకిస్థాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి యూఎస్ మీడియా కథనాలను ఖండించారు. నూర్ఖాన్ ఎయిర్‌బేస్ ప్రజలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతంలో ఉందని, కాబట్టి ఇలాంటి కార్యకలాపాలు అక్కడ రహస్యంగా జరగడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఇక ఘర్షణ ప్రారంభం కావడానికి ముందు మహాన్ ఎయిర్‌కు చెందిన ఒక ఇరాన్ పౌర విమానం కాబుల్‌లో దిగిందని అఫ్గాన్ పౌర విమానయాన అధికారి చెప్పారు. ఘర్షణలవల్ల ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో విమానం ఇక్కడే ఉండిపోయిందని తెలిపారు. విమానాలను ఇతరదేశాలకు తరలించి దాచాల్సిన అవసరం ఇరాన్‌కు లేదని ఇరాన్ పేర్కొన్నది.
ఈ వార్తలపై అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఒకవేళ ఇదే నిజమైతే యుద్ధం ముగింపు విషయంలో మధ్యవర్తిగా పాకిస్థాన్ పాత్రను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.