US citizenship : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్‌ను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం (US citizenship) మరింత ఖరీదుగా మారనుంది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75 శాతం మేర పెంచాలని యూఎస్‌కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించింది. సక్రమ మార్గంలో వచ్చిన వలసదారులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. ప్రాసెసింగ్, వెట్టింగ్ ఖర్చులు భరించాల్సిరావడంతోపాటు ఇప్పటివరకు ఉన్న పలు మినహాయింపులను కూడా కోల్పోనున్నారు.
పౌరసత్వ దరఖాస్తు (పేపర్ బేస్డ్) ఫైల్ చేయడానికి ఫీజు 760 డాలర్ల నుంచి 1330 డాలర్లకు పెరగనుంది. ఆన్లైన్ దరఖాస్తు విషయానికొస్తే 710 డాలర్ల నుంచి 1280 డాలర్లకు ఫీజు పెంపును అధికారులు ప్రతిపాదించారు. ఈ కొత్త ఫీజులు అమల్లోకి వస్తే 75 శాతం మేర భారం పడనుంది. ఏదైనా సిటిజన్‌షిప్ అప్లికేషన్ తిరస్కరణకు గురైతే.. దానిని తిరిగి పరిశీలించాలని కోరినా సరే ఖర్చుల మోత మోగనుంది. ఆ రుసుము 830 డాలర్ల నుంచి 1475 డాలర్లకు అంటే 645 డాలర్ల మేర పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత నిబంధనలపై 60 రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.
అలాగే అమెరికాలో ఆదాయ ఆధారిత మార్గదర్శకాల ప్రకారం.. దరఖాస్తుదారులకు ప్రస్తుతం లభిస్తోన్న మినహాయింపులను తొలగించాలని డీహెచ్ఎస్ ప్రతిపాదించింది. 400 శాతం లేక అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు రెడ్యూస్డ్ ఫీజ్ ఆప్షన్‌ను తీసేయాలని సూచించింది. ఈ కొత్త రూల్స్ వల్ల సహజంగా పౌరసత్వం పొందడానికి అర్హత ఉన్న శాశ్వత నివాసితులు తమకున్న అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.