కొలంబో: చైనా నిఘా నౌకలపై భారత్ అభ్యంతరాలు, ఆందోళనలను శ్రీలంక పక్కకు పెడుతోంది. విదేశీ రిసెర్చ్ షిప్స్పై (Foreign Research Ships) నిషేధం ఎత్తివేతకు నిర్ణయించింది. జపాన్ను సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, ఆ దేశ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనలను తమ ప్రభుత్వం అనుమతించదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమని సబ్రీ అన్నారు. ఇతర దేశాల మధ్య వివాదాలతో తమ దేశానికి సంబంధం లేదన్నారు. మారటోరియం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంటుందని, ఆ తర్వాత విదేశీ పరిశోధన నౌకలను శ్రీలంక నిషేధించబోదని సబ్రీ చెప్పారు.
కాగా, 2023 నవంబర్ వరకు చైనాకు చెందిన రెండు నిఘా నౌకలు శ్రీలంక పోర్టుల్లో ఉన్నాయి. దీనిపై భారత్, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. శ్రీలంక నౌకాశ్రయాల వద్ద అలాంటి నౌకలను అనుమతించవద్దని కోరాయి. దీంతో ఈ ఏడాది జనవరిలో విదేశీ పరిశోధన నౌకల ప్రవేశాన్ని శ్రీలంక నిషేధించింది. అయితే ఒక చైనా నౌకకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి విదేశీ రిసెర్చ్ షిప్స్పై నిషేధాన్ని ఎత్తివేయాలని శ్రీలంక నిర్ణయించింది.