వాషింగ్టన్: అమెరికన్ గ్రీన్ కార్డ్ మంజూరులో జాప్యాలు ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. వర్క్ పర్మిట్ గడువు ముగియడంతో మెట్రోపాలిటన్ అట్లాంటా ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ సీఈఓ కొల్లీ గ్రీన్వుడ్ ఈ నెల 17న రాజీనామా చేశారు. కెనడా జాతీయుడైన గ్రీన్వుడ్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ గడువు జూన్ 18న ముగిసింది. ఆయనకు గ్రీన్ కార్డ్ మంజూరులో జాప్యం జరుగుతుండటంతో పదవిలో కొనసాగడం ఇక అసాధ్యంగా మారింది.
అందుకే ఆయన ముందస్తు పదవీ విరమణను ఎంచుకున్నారు. త్వరలోనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందని ఈ అథారిటీ ఆయనకు భరోసా ఇచ్చినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. అమెరికా ట్రాన్సిట్ సెక్టార్లో ఇటీవల హై-ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలు పెరిగిపోతున్నాయి. ఆపరేషనల్ ఛాలెంజెస్తోపాటు ఇమిగ్రేషన్ టైమ్‌లైన్స్ కఠినంగా ఉండటమే దీనికి కారణం.