న్యూఢిల్లీ : అమెరికా, కెనడా చదువుల కోసం ఎంక్వైరీలు తగ్గిపోతున్నాయి. అమెరికా చదువు కోసం నిరుడు 46 శాతం, కెనడా చదువు కోసం రెండేళ్లలో దాదాపు 75 శాతం ఎంక్వైరీలు తగ్గిపోయాయి. అంతర్జాతీయ విద్యా సేవలను అందించే ఐడీపీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ డైరెక్టర్ పీయూష్ కుమార్ మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా అమెరికా విషయంలో ఆందోళనగా ఉందన్నారు. గడచిన 6-12 నెలల్లో ఇది కనిపిస్తున్నదన్నారు. అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రణాళికలపై దీని ప్రభావం పడిందని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు నుంచే ఈ పరిస్థితి ప్రారంభమైందని చెప్పారు.
జూన్ తర్వాత నుంచి ఈ పరిస్థితి మనకు కనిపిస్తున్నదని, వీసా అప్రూవల్ రేట్లు క్షీణించాయని వివరించారు. ప్రతిసారీ ఎన్నికల సంవత్సరంలో వీసా అప్రూవల్ రేట్లు ఏదో ఓ కారణంతో తగ్గిపోతున్నట్లు గుర్తు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం అమెరికన్ చదువుల కోసం 2024 మే నెలతో పోల్చినపుడు 2025 మే నెలలో ఎంక్వైరీలు 46.4 శాతం తగ్గిపోయాయని చెప్పారు. కెనడాలో చదువు కోసం ఎంక్వైరీలు గడచిన రెండేళ్లలో 70-75 శాతం మేరకు తగ్గిపోయినట్లు చెప్పారు. బ్రిటన్, ఆస్ట్రేలియా చదువుల కోసం డిమాండ్ యథాతథంగా కొనసాగుతున్నదన్నారు.