వాంకోవర్: కెనడాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాంకోవర్లో భీకర తుఫాన్ ధాటికి రోడ్లు, రైలు లింకులన్నీ కొట్టుకుపోయాయి. శతాబ్ధంలో ఓసారి ఇలాంటి విపత్తు సంభవిస్తుందని అధికారులు ప్రకటించారు. తీవ్రమైన వరదల వల్ల వాంకోవర్ వైపున ఉన్న రెండు రహదారులను మూసివేశారు. కొండచరియలు విరిగిపడడంతో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు మిస్సైనట్లు తెలుస్తోంది. సోమవారం వచ్చిన తుఫాన్ వల్ల వేలాది మంది ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక నెలలో కురవాల్సిన వర్షపాతం కేవలం 24 గంటల్లో కురిసిందని, దీంతో బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో వేలాది మందిని తరలించాల్సి వచ్చిందని మంత్రి రాబ్ ఫ్లెమింగ్ తెలిపారు. వాంకోవర్కు 120 మైళ్ల దూరంలో ఉన్న మెరిట్లోని నివాసితులను మరోచోటుకు తరలించారు. భీకరంగా ప్రవహిస్తున్న మంచునీటిలో కార్లు కొట్టుకుపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు.