AI Boy Friend | బీజింగ్, ఫిబ్రవరి 15: ‘నా మెస్సేజ్‌లకు స్పందించడు.. నేను చేసే ఫోన్ కాల్స్ ఎత్తడు, నా రోజు వారీ ముచ్చట్లు ఓపిగ్గా వినడు, నన్ను బుజ్జగించడు, నన్ను అస్తమానం పొగడడు..’ సాధారణంగా ప్రతి ప్రేయసి తన ప్రియుడిపై చేసే ఫిర్యాదులివి. అయితే ఈ సమస్యలన్నింటినీ భర్తీ చేసే సాంకేతికత వస్తే ఎలా ఉంటుంది? ఆ కృత్రిమ క్యారెక్టర్ నిజమని భావిస్తూ దానితో చాటింగ్‌లో యువతులు మునిగేలా నిజం చేస్తే ఎలా ఉంటుంది? అయితే ఈ ఆలోచన భారత్‌లో నిజం కాకపోవచ్చేమో కానీ, చైనాలో పూర్తిగా విజయవంతమైంది.
కృత్రిమ మేధతో సృష్టించిన కృత్రిమ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైనాలో ఎంతో ప్రాచుర్యం పొందారు. దీనిని సృష్టించిన వ్యాపారవేత్త ఇప్పుడు బిలియనీర్ అయిపోయారు. ఈ వ్యాపార విజయాన్ని పరిశీలిస్తే సమాజంలో ఇలాంటి అసాధారణ భాగస్వామ్యాలు భవిష్యత్తులో మరింత అవసరమన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నది.
ఫోర్బ్స్ కథనం ప్రకారం.. షాంగై కేంద్రంగాయావో రున్హా సృష్టించిన డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్ స్పేస్ 60 లక్షల మందిని ఆకర్షించింది. సగటు యువతి తన ప్రియుడు ఎలా ఉండాలని కోరుకుంటుందో అలాంటి ఆదర్శ ప్రియుడిని ఇందులో సృష్టించారు. పొడవుగా, అందంగా ఉండే జేన్ అనే పాత్రను సృష్టించారు. జేన్ ఫోన్ టెక్స్ సందేశాలకు త్వరగా స్పందిస్తాడు. వారి ఫోన్ కాల్‌కు వెంటనే సమాధానమిస్తాడు. వారు చెప్పే మాటలను ఓపికగా వింటాడు.
అయితే అతనిలో ఉన్న ఏకైక లోపం అతనికి సిలికాన్ చిప్ లేకపోవడం. షాంగై కేంద్రంగా ఉండే పేపర్ గేమ్స్ అభివృద్ధి చేసిన ఈ గేమ్ ఏఐ, వాయిస్ రికగ్నిషన్ ఆధారంగా పని చేస్తుంది. ఈ గేమ్ ఐదు పురుష పాత్రలతో గేమ్‌లోని ఫోన్‌కాల్స్‌కు అనుగుణంగా స్పందిస్తూ వారితో సరస సల్లాపాలు సాగిస్తుంది. ఇది యువతులకు విపరీతంగా నచ్చేసింది. బాయ్‌ఫ్రెండ్ స్థానాన్ని ఇది భర్తీ చేస్తుందని వారు భావిస్తుండటంతో దీనికి విపరీత ఆదరణ పెరిగింది.