న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. వినియోగదారులకు కాల్ చేసి బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్న స్కామర్లకు చెక్‌పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ ఏఐ బామ్మ ‘డైసీ’ని సృష్టించింది. వినియోగదారులకు స్కామర్లు బురిడీ కొట్టించడం కాదు.. ఏఐ బామ్మే వారిని బుట్టలోకి దింపుతుంది.
కుటుంబ విషయాలు, అవీఇవీ మాట్లాడుతూ వారి సమయాన్ని వృథా చేస్తుంది. తద్వారా ప్రజలు స్కామ్ కాల్స్ బారినపడకుండా కాపాడుతుంది. డైసీ సాధారణ చాట్‌బాట్ కాదు. అత్యంత అధునాతన ఏఐ సాంకేతికతతో దీనిని డిజైన్ చేశారు.
ఇది అచ్చం మనిషిలానే మాటలు కలుపుతుంది. అవతలివారు చెప్పింది వినడమే కాదు.. అప్పటికప్పుడు వాటికి సమాధానాలు కూడా ఇస్తుంది. స్కామర్లు తాము నిజంగానే నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగానే భ్రమపడేంతగా డైసీ ముచ్చట్లు చెప్తుంది. బ్రిటన్‌లో ప్రతి 10మందిలో ఏడుగురు స్కామర్లపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారని, కానీ సమయాన్ని వృథా చేసుకోవడం లేక మిన్నకుంటున్నట్టు పరిశోధనలో తేలింది.
ఈ నేపథ్యంలో ఏఐ బామ్మ డైసీని సృష్టించారు. వారు తీర్చుకోవాలన్న ప్రతీకారాన్ని డైసీ తీర్చిపెడుతుంది. ఏకధాటిగా 40 నిమిషాల వరకు మాట్లాడి మోసగాళ్ల సమయాన్ని వృథా చేయగలదు. తద్వారా వినియోగదారులు స్కామర్ల బారినపడకుండా కాపాడుతుంది.