వాషింగ్టన్: మోసపూరిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం విరుచుకుపడుతున్నది. మరీ ముఖ్యంగా ‘అసాధారణ సామర్థ్యం’ విభాగంలోని ఈబీ-1ఏపై దృష్టి పెట్టింది. సైన్స్, బిజినెస్, అథ్లెటిక్స్, ఆర్ట్స్ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలు గలవారి కోసం ఈబీ-1ఏ వీసాను అమెరికా ఇస్తుంది. అత్యున్నత స్థాయి నైపుణ్యంగల వలసదారులకు ఇది చాలా కాలం నుంచి ఆకర్షణీయమైన మార్గంగా ఉంది. ఇమిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈబీ-1ఏ పిటిషన్లలో చాలా వరకు రీ-ఇన్వెస్టిగేషన్‌ను ఎదుర్కొంటున్నాయి.
వీటిలో అత్యధిక దరఖాస్తులు భారతీయులవే. చాలా దరఖాస్తులను అధికారులే రద్దు చేస్తుండటం పెరుగుతున్నది. రెడ్డి తన యూట్యూబ్ చానల్లో పెట్టిన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం, కొందరు దరఖాస్తుదారులు నాసిరకం జర్నల్స్‌లో వ్యాసాలను ప్రచురిస్తున్నారు. సమన్వయంతో కూడిన సహ రచన ద్వారా బూటకపు ప్రస్తావనలను, పురస్కారాలను సృష్టిస్తున్నారు. ఇందుకోసం కొన్ని ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తున్నారు, ప్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు.
ఇటువంటి వారిని పట్టుకునేందుకు, గతంలో ఆమోదం పొందిన ఈబీ-1ఏ పిటిషన్లను కూడా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. దాదాపు 200 మంది కలిసి ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని, వారు ఒకరి క్రెడెన్షియల్స్‌ను మరొకరు బలపరచుకుంటున్నారని, డబ్బు చెల్లిస్తే, ఇతరులకు కూడా ఇలా చేసిపెడతామని చెప్తున్నారని ఓ సోషల్ మీడియా యూజర్ చెప్పినట్లు రాహుల్ రెడ్డి తెలిపారు. ఈబీ-1ఏ కేటగిరిని ప్రక్షాళన చేసి, ఈ పథకం సమగ్రతను పునరుద్ధరించడం కోసం యూఎస్సీఐఎస్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ అంశాలు బయటపడినట్లు చెప్పారు.
యూఎస్సీఐఎస్ చర్యలను నిజాయితీగా చట్టబద్ధ మార్గాల్లో ఈబీ-1ఏ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న భారతీయులు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో నిజాయితీ, సమగ్రత వస్తాయని ఆశిస్తున్నారని చెప్పారు.
యూఎస్సీఐఎస్ కొత్త దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు, గతంలో ఆమోదించిన ఐ-140 పిటిషన్లు, గ్రీన్ కార్డులను తిరిగి పరిశీలించి, రద్దు చేయడం ప్రారంభించవచ్చునని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థామస్ వీ అల్లెన్ లా ఆఫీస్ ఇచ్చిన లింక్డ్ఇన్ పోస్ట్‌లో, ఈబీ-1ఏ కేస్ బిల్డర్‌కు డబ్బు చెల్లించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించింది. నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా తగిన సాక్ష్యాధారాలను సృష్టించేందుకు కేస్ బిల్డర్లు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తారని, ఇటువంటి షార్ట్‌కట్స్ వల్ల దీర్ఘకాలంలో నష్టం తప్పదని హెచ్చరించింది. దరఖాస్తుకు ఆమోదం లభించినా సురక్షితం కాదంది.