హాంగ్‌కాంగ్: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. అక్కడ రోజుకు కోటికిపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని వివిధ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ, చైనా సర్కారు మాత్రం నిజాలు దాస్తున్నది. రోజువారీ కొత్త కేసుల సంఖ్యను కేవలం 20 వేల నుంచి 30 వేల మధ్య చూపిస్తున్నది. ఎటుచేసీ అగ్రరాజ్యం అమెరికా కంటే తమ దగ్గర ఒకటి లేదా రెండు వేల కేసులు తక్కువగానే నమోదైనట్లు చైనా ప్రభుత్వం చూపిస్తూ వచ్చింది.
అయితే, చైనా కొవిడ్ కేసుల లెక్కలు వాస్తవదూరంగా ఉన్నాయనడానికి చాలా రుజువులు కనిపిస్తున్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే హాంగ్‌కాంగ్ జనాభా చైనా జనాభాలో కేవలం 0.5 శాతం ఉంటుంది. అటువంటిది హాంగ్కాంగ్లోనే రోజుకు 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరి అలాంటప్పుడు హాంగ్‌కాంగ్ కంటే ఎక్కువగా వైరస్ ప్రభావం ఉన్న చైనాలో 20 వేల పైచిలుకు కేసులు మాత్రమే ఎలా నమోదవుతున్నాయంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు.
కరోనా రోగులతో కిక్కిరిసిన ఆస్పత్రులు
మరో ముఖ్య విషయం ఏమిటంటే చైనాలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. రోగులకు బెడ్లే దొరకడం లేదు. దాంతో నేలపైనే పడుకోబెట్టి రోగులకు చికిత్సలు చేస్తున్నారు. ఆక్సిజన్ ఈథర్ కూడా ఆ దేశంలో అవసరానికి సరిపడా లేదు. ఫ్లోటింగ్ కారణంగా ఎమర్జెన్సీ టోల్‌ఫ్రీ నంబర్స్ అన్నీ జామయ్యాయి. ఆస్పత్రుల ముందు రోగులతో వచ్చిన అంబులెన్స్‌లు బారులు తీరి ఉన్నాయి.
శ్మశాన వాటికల దగ్గర మృతదేహాల క్యూ లైన్లు
మరోవైపు ఆరోగ్య సిబ్బందిలో కూడా చాలామంది ఇన్ఫెక్షన్ సోకి మృత్యువాత పడుతున్నారు. మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో మార్చురీలు అన్నీ శవాలతో నిండిపోయాయి. శ్మశాన వాటికల దగ్గర కూడా భారీగా శవాల క్యూలైన్లు ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లోని అతిపెద్ద శ్మశాన వాటిక బాబోషన్ ఫ్యునెరల్ హౌస్‌లో సిబ్బంది 24 గంటలూ దహనాలు చేస్తూనే ఉన్నా మరో 20 రోజుల సమయం పట్టేన్ని మృతదేహాలు వెయిటింగ్లో ఉన్నాయి.
అరకొరగా మృతదేహాల స్టోరేజీ సౌకర్యం
పైగా మృతదేహాలు పాడవకుండా చూసుకునేందుకు మృతుల కుటుంబసభ్యులకు స్టోరేజీ సౌకర్యాలు కూడా సరిపడా లేవు. మరోవైపు షాంఘై సిటీలో మరో రెండు వారాల్లో సగానికిపైగా జనాలు కొవిడ్ బారినపడే ప్రమాదం ఉన్నదని దెజీ ఆస్పత్రి వైద్యులు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి హెచ్చరికలు రావడంతో ఆ పోస్టును తొలగించారు. వాస్తవానికి చైనాలో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే అక్కడి ప్రభుత్వం మాత్రం తమ దగ్గర కరోనా కంట్రోల్లోనే ఉందంటూ తేలిగ్గా చేతులు కడిగేసుకుంటున్నది.