న్యూయార్క్: అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ సిటీలో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ జారీ చేశారు. ఇటీవల వారాల్లో కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హై రేటింగ్ ఇవ్వడం వల్ల ఆ నగరంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. నగరంలో హెల్త్ కేర్ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్నారు. హై అలర్ట్ జారీ చేయడం అంటే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని, మిత్రులు..బంధువులు, తోటి ఉద్యోగులకు వైరస్ సంక్రమించకుండా చూసుకోవాలని సిటీ హెల్త్ కమీషనర్ డాక్టర్ అశ్విన్ వాసన్ తెలిపారు.
అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో నగర ప్రజలు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. పబ్లిక్ ఇండోర్ సెట్టింగ్స్‌లో కానీ ఔట్‌డోర్ సెట్టింగ్స్‌లోనూ మాస్క్ అనివార్యం. కానీ ఇప్పుడు మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వలేదని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు. ఏడు రోజుల సగటు పాజిటివ్ రేటు 5.18 శాతానికి పెరిగినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నుంచి అమెరికాలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 10 లక్షల మందికిపైగా మృతిచెందారు.