వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే మన భారతీయ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాక్సిన్‌ను వాడేందుకు అనుమతులు కోరుతూ అగ్రరాజ్యం అమెరికాలో కూడా దరఖాస్తులు నమోదైనట్లు తెలుస్తోంది. అమెరికాలో 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ ఓక్యుజెన్ అనే కంపెనీ దరఖాస్తు చేసిందట.
ఈ విషయాన్ని సదరు కంపెనీనే వెల్లడించింది. చిన్నారులపై చేసిన కొవాగ్జిన్ పరీక్షలకు సంబంధించిన డేటాను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు పంపిందట. అయితే ఈ పరీక్షలేవీ అమెరికాలో జరగలేదు. ఈ కారణంగా కొవాగ్జిన్‌కు ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి.
ఓక్యుజెన్ భాగస్వామ్యంతో తయారు చేసిన కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. అలాగే 17 దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీలో ఇనాక్టివ్ వైరస్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. పోలియో టీకా వంటి చాలావరకు పిల్లలకు వేసే వ్యాక్సిన్లను ఈ పద్ధతిలోనే తయారు చేస్తారట.
ఈ కారణంగానే 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారికి కొవాగ్జిన్ అందించే అనుమతులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వాన్ని ఓక్యుజెన్ కంపెనీ కోరింది. మరి దీనిపై అమెరికా ఎఫ్‌డీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.