న్యూయార్క్: దేశాన్ని నడిపించే వ్యక్తి.. వృద్ధుడు అయి ఉండకూడదని మెజారిటీ అమెరికన్లు అభిప్రాయపడ్డారు. పీవ్ రీసర్చ్ సెంటర్(Pew Research Center) నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ విషయం తెలిసింది. దేశ అధ్యక్ష(US President) హోదాలో వృద్ధ వ్యక్తి ఉండాలని కేవలం మూడు శాతం మంది మాత్రమే కోరుకుంటున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైంది. 70 ఏళ్ల దాటిన వ్యక్తి అధ్యక్షుడు కావాలని కేవలం మూడు శాతం మంది మాత్రమే ఆశిస్తున్నట్లు పీవ్ రీసర్చ్ సెంటర్ పేర్కొన్నది.
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వయసు 80 ఏళ్లు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవి చేపట్టిన అత్యంత వృద్ధుడు ఈయనే. ఇక బైడెన్‌కు ప్రత్యర్థిగా ఉన్న ట్రంప్ వయసు 77 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడనున్న విషయం తెలిసిందే. దేశాధ్యక్షుడి సగటు వయసు ఎంత ఉండాలని సర్వే చేస్తున్న సమయంలో బైడెన్ గురించి కానీ, ట్రంప్ గురించి కానీ పోల్‌లో అడగలేదు.
కానీ చాలా వరకు అమెరికా ప్రజలు .. యువ అధ్యక్షుడు కావాలన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడి వయసు కనీసం 35 ఏళ్లు ఉండాలి. ఇక కేవలం మూడు శాతం మంది మాత్రమే అధ్యక్షుడి వయసు 30 దశకంలో ఉండాలన్నారు.
ఇక సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 49 శాతం మంది అధ్యక్షుడి వయసు 50 దశకంలో ఉండాలని అభిప్రాయపడ్డారు. 60 ఏళ్లు దాటి ఉండాలని సుమారు 24 శాతం మంది కోరుకున్నారు. 40 ఏళ్లు దాటి ఉండాలని 17 శాతం మంది ఆశించారు. జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. మొత్తం 5115 మంది యువకుల్ని ప్రశ్నించారు.
వచ్చే దేశాధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ లేదా ట్రంప్ పోటీపడరాదు అని సుమారు 36 శాతం మంది అభిప్రాయపడ్డారు.