అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కరోనా పేరు చెప్తేనే అమెరికా పౌరులు వణికిపోయేంతలా భయపెట్టిందీ వైరస్. ఇప్పుడు తాజాగా వెలువడిన కొన్ని లెక్కలు.. మరోసారి ఈ మహమ్మారి అమెరికా ప్రజలపై పంజా విసరటానికి రెడీగా ఉందని చెప్తున్నాయి. అమెరికాలో వేస్ట్‌వాటర్ నెట్వర్క్ (మురికి కాల్వల వ్యవస్థ) మానిటర్స్‌లో ఆందోళనకర అంశాలు వెల్లడైనట్లు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాలు చెప్తున్నాయి.
సరిగ్గా నెలరోజుల కిందట ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీలోపు అమెరికా వేస్ట్ వాటర్ లెక్కల్లో.. 15 శాతం ప్రాంతాల్లో కరోనా పెరుగుతున్నట్లు వెల్లడైంది. అలాగే 80 శాతం ప్రాంతాల్లో కరోనా తగ్గుతుండగా.. 5 శాతం ప్రాంతాల్లో కరోనా కేసులు నిలకడగానే ఉన్నాయి. ఈ లెక్కలు మార్చి 1 నుంచి 10వ తేదీ నాటికి మారిపోయాయి. ఈ కాలంలో 59 శాతం ప్రాంతాల్లో మాత్రమే కరోనా తగ్గుదల నమోదవగా.. సుమారు 5 శాతం ప్రాంతాల్లో కరోనా పరిస్థితి నిలకడగా ఉంది.
అదే సమయంలో 36 శాతం ప్రాంతాల్లో కరోనా పెరుగుతోందని తేలింది. ఈ లెక్కలు చూసిన కొందరు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో చాలా మంది ఇళ్లలోనే కరోనా పరీక్షలు చేసుకుంటున్నారని, అలాగే అసింప్టమాటిక్ కేసులు కూడా చాలా ఉండే అవకాశం ఉందని, అందువల్లే కరోనా కేసులు ఇంకా బయటపడకపోయి ఉండొచ్చని వాళ్లు అంటున్నారు. అయితే త్వరలోనే కరోనా కేసులు మరోసారి విజృంభించే ప్రమాదం ఉందంటున్నారు.
యూరప్‌లో జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాల్లో కూడా ఇలాగే జరిగింది. వేస్ట్ వాటర్ లెక్కలు విడుదలైన కొన్ని రోజుల్లోనే అక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. యూరప్, అమెరికా మధ్య వాతావరణం, జనాభా, పబ్లిక్ హెల్త్ విధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ కారణంగానే యూరప్‌లో జరిగినట్లే అమెరికాలో జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.
వేస్ట్ వాటర్ లెక్కలు ఎలా తీస్తారంటే?
కరోనా సోకిన వారు టాయిలెట్‌కు వెళ్లినప్పుడు.. మలం ద్వారా వారి శరీరంలోని కొంత వైరస్ బయటకు వస్తుంది. ఇది డ్రైనేజీ వ్యవస్థలోకి చేరుతుంది. ఈ వ్యవస్థలోని నీటినే పరీక్షించి వేస్ట్ వాటర్ గణాంకాలు వెల్లడిస్తారు. ఈ లెక్కలు కేసులు పెరగడానికి చాలా రోజుల ముందే అవి పెరుగుతాయని గుర్తిస్తాయి. దీనివల్లే ఈ వేస్ట్‌వాటర్ డేటా వెలువడిన తర్వాత అమెరికన్లలో మరోసారి గుబులు మొదలైంది.