శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 30, 2020 , 16:33:21

మ‌రో ప‌ది రోజుల్లో.. తీవ్ర స్థాయికి క‌రోనా

మ‌రో ప‌ది రోజుల్లో.. తీవ్ర స్థాయికి క‌రోనా

హైద‌రాబాద్‌:  రానున్న మ‌రో ప‌ది రోజుల్లో.. చైనాలో క‌రోనా వైర‌స్ మ‌రింత విస్తృతంగా ప్ర‌బ‌ల‌నున్న‌ది.  ఆ దేశానికి చెందిన ప్ర‌ఖ్యాత శ్వాస‌కోస నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  మ‌రో వారం లేదా ప‌ది రోజుల్లో క‌రోనా వైర‌స్ కేసులు అత్య‌ధిక స్థాయిలో న‌మోదు అవుతాయ‌న్నారు.  చైనాకు చెందిన వార్తా సంస్థ జినువాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌చ్చితంగా ఎప్పుడు ఈ వ్యాధి అత్య‌ధిక స్థాయిలో విస్త‌రిస్తోందో చెప్ప‌లేమ‌న్నారు. కానీ ప‌ది రోజుల్లో మాత్రం వైర‌స్ కేసులు తారాస్థాయికి చేర‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఆ త‌ర్వాత క‌రోనా కేసులు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయ‌న్న అభిప్రాయాన్ని ఆయ‌న వినిపించారు.  వ్యాధి ప్ర‌బ‌లుతున్న తీరును నియంత్రించేందుకు కేవ‌లం రెండు మార్గాలే ఉన్నాయ‌ని,  మొద‌ట క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల్ని గుర్తించ‌డం, ఆ త‌ర్వాత వారిని ఒంట‌రిగా దూరంగా పెట్ట‌డ‌మే ముఖ్య‌మ‌న్నారు.  ఈ రెండూ ప్రాచీన ప‌ద్ధ‌తులే అని, కానీ అవే ఉత్త‌మ‌మైన‌వ‌న్నారు.  నావెల్ క‌రోనా వైర‌స్ సోకిన వారు తొలుత జ్వ‌రం, బ‌ల‌హీన‌త‌తో ఇబ్బందిప‌డుతార‌ని జాంగ్ నాన్‌షాన్ తెలిపారు.  క‌నీసం 14 రోజులు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచాల‌ని, ఆ త‌ర్వాత పేషెంట్ బ‌ల‌హీప‌డితే, ఆ రోగికి మ‌రింత చికిత్స ఇవ్వాల‌ని, ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే.. చికిత్స అవ‌స‌రం లేద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల 107 మంది మృతిచెందారు.  క‌నీసం 8 వేల కేసులు న‌మోదు అయ్యాయి.  

క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు సుమారు మూడు లేదా నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని జాంగ్ తెలిపారు. వైర‌స్‌కు చెందిన యాంటీబాడీల‌ను న్యూట్రలైజ్ చేసేందుకు శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప‌రిశోధ‌న‌ల‌ను వేగం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  2017లో తొలిసారి గ‌బ్బిల్లాల్లో క‌రోనా ఛాయ‌ల‌ను గుర్తించామ‌న్నారు.  అయితే తాజాగా ప్ర‌బ‌లుతున్న వైర‌స్‌కు ఓ క్రూర మృగం హోస్ట్‌గా ఉండి ఉంటుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో వ్యాపించిన సార్స్‌(సివియ‌ర్ అక్యూట్ రెస్పిరేట‌రీ సిండ్రోమ్‌) సుమారు ఆరు నెల‌ల పాటు బీభ‌త్సం సృష్టించింద‌ని, అయితే క‌రోనా అంత కాలం ఉండ‌క‌పోవ‌చ్చు అని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు త‌క్ష‌ణ‌మే తాత్కాలిక ఆస్ప‌త్రిని నిర్మిస్తున్నామ‌ని, ఆ హాస్ప‌ట‌ల్ నిర్మాణం పూర్తి కావ‌స్తున్న‌ద‌న్నారు.  హాస్ప‌ట‌ల్స్‌లో విధులు నిర్వ‌హిస్తున్న వారికి కూడా కొన్ని చోట్ల వైర‌స్ సోకుతున్న‌ది.  అయితే వారికి వెంట‌నే చికిత్స‌ను అందిస్తున్నారు. కరోనా క‌ట్ట‌డి కోసం నిరంత‌రం శ్ర‌మిస్తూనే ఉండాల‌ని చైనా ఆధ్య‌క్షుడు జిన్‌పింగ్ .. ఆ దేశ ఆర్మీని ఆదేశించారు.


logo