MIT | న్యూయార్క్, నవంబర్ 14 : భూతాపానికి కారణమయ్యే గ్రీన్‌హౌజ్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలకు ఊతమిచ్చే కొత్త పరికరాన్ని అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ఇంజినీర్లు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రో కెమికల్ వ్యవస్థల ద్వారా కాలుష్య కారక కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగకరమైన ఇంధనాలు, రసాయనాలు, ప్లాస్టిక్‌గా మార్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఆర్థిక కోణంలో ఇవి ఆచరణాత్మక ఫలితాలు ఇవ్వడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రో కెమికల్ వ్యవస్థల్లో వినియోగించే ఎలక్ట్రోడ్ల కోసం ఎంఐటీ ఇంజినీర్ల బృందం కొత్త డిజైన్‌ను అభివృద్ధి చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పీటీఎఫ్ఈ(టెఫ్లాన్)ను వినియోగించి ఈ ఎలక్ట్రోడ్‌ను తయారుచేసినట్టు ఎంఐటీ ఇంజినీర్లు తెలిపారు. కొత్త ఎలక్ట్రోడ్.. కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగకరమైన ఇథిలీన్, మిథేన్, మిథనాల్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలుగా మార్చే ప్రక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఆర్థికంగా ఆచరణ సాధ్యం చేస్తుందని ఎంఐటీ ఇంజినీర్లు తెలిపారు.