బొగొటా, జూన్ 22: కొలంబియా రాజధాని బొగొటాలోని ప్రఖ్యాత శాంటా మారియా ప్లాజాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాదిమంది యోగా సాధకులు, ఔత్సాహికులు పాల్గొన్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ హాజరయ్యారు.
సరిగ్గా ఓ దశాబ్దం కిందట కొలంబియా ప్రభుత్వం, తీవ్రవాద ఫార్క్ గెరిల్లా సంఘాలు శాంతి ఒప్పందం చేసుకోవటంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చారిత్రకమైన ఈ ఘటనకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది యోగా దినోత్సవ వేడుకలు కొలంబియాలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇది కొలంబియాలో శాంతి దశాబ్దానికి గుర్తుగా నిలిచింది.