న్యూఢిల్లీ, జూలై 26: థాయ్లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 32కి చేరుకోవడంతోపాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఐక్య రాజ్య సమితికి చెందిన భద్రతా మండలి శుక్రవారం న్యూయార్క్లో రహస్యంగా అత్యవసర సమావేశం నిర్వహించి థాయ్-కంబోడియా తాజా ఘర్షణలపై చర్చలు జరిపింది. కాగా, ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.
మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని ప్రతిపాదించింది. ఘర్షణలను నిలిపివేసి సంయమనం పాటించాలని, వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐరాస దౌత్యవేత్త ఒకరు కోరారు. తమపై ముందుగా కంబోడియా దాడి చేసినట్లు థాయ్లాండ్ చేస్తున్న ఆరోపణలపై సమితిలోని కంబోడియా రాయబారి చియా కేవ్ స్పందిస్తూ తమ కన్నా మూడు రెట్ల పెద్ద సైన్యం, వైశాల్యం ఉన్న దేశంపై వైమానిక దళమే లేని ఓ చిన్న దేశం ఎలా దాడి చేయగలదని ప్రశ్నించారు.
కంబోడియా-థాయ్లాండ్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో కంబోడియాలో నివసిస్తున్న భారతీయులకు భారత విదేశాంగ శాఖ శనివారం అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలోని భారతీయులు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.ఈ ప్రాంతంలోని భారతీయ ప్రయాణికులకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే రెండు దేశాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలను హెల్ప్లైన్ల ద్వారా సంప్రదించవచ్చునని తెలిపింది.