లండన్: ప్రజల్ని మోసం చేసి సొమ్మును బిట్‌కాయిన్(Bitcoin)లోకి మార్చిన ఓ చైనీస్ మహిళను బ్రిటన్ కోర్టు దోషిగా తేల్చింది. జిమిన్ కియాన్ అనే మహిళ క్రిప్టోకరెన్సీ ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడింది. ఆమె సుమారు ఏడు బిలియన్ల డాలర్లు క్రిప్టో కరెన్సీ ఆర్జించినట్లు దర్యాప్తులో గుర్తించారు. చైనాకు చెందిన ఆ మహిళ పాంజీ స్కీమ్ ద్వారా స్థానికుల నుంచి డబ్బులు తీసుకుని వాటిని బిట్‌కాయిన్‌లోకి మనీల్యాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడు బిలియన్ల డాలర్ల విలువైన 61 వేల బిట్కాయిన్లను రికవరీ చేసినట్లు బ్రిటన్ మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.
జిమిన్ కియాన్‌ను యాది జాంగ్ అని కూడా పిలుస్తారు. సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో ఆమెను విచారించారు. అక్రమంగా క్రిప్టోకరెన్సీ కలిగి ఉన్న కేసులో ఆమెకు శిక్షను విధించారు. 2014 నుంచి 2017 మధ్య ఆ మహిళ భారీగా స్కామ్‌కు పాల్పడింది. సుమారు 1,28000 వేల మందిని ఆమె మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులను ఆమె బిట్కాయిన్ల రూపంలో దాచినట్లు మెట్ పోలీసులు చెప్పారు.
47 ఏళ్ల ఆ మహిళ కేసులో విచారణకు ఏడేళ్లు పట్టింది. ఓ క్రిమినల్‌కు చెందిన నిధులతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారం దొరకడంతో ఈ కేసులో దర్యాప్తును లోతుగా చేపట్టారు. అయితే తప్పుడు డాక్యుమెంట్లు చూపించి ఆమె చైనా నుంచి తప్పించుకున్నది. బ్రిటన్‌లోకి ప్రవేశించిందామె. అయితే చోరీ చేసిన సొమ్ముతో అక్కడ ఆమె ప్రాపర్టీలు కొన్నట్లు మెట్ పోలీసులు చెప్పారు.