బీజింగ్: చైనాకు చెందిన జూ అనే మహిళ.. తన చనిపోయిన కుక్క క్లోనింగ్(Dog Cloning) కోసం సుమారు 19 లక్షలు ఖర్చు చేసింది. చైనీస్ కరెన్సీలో ఆ మొత్తం లక్షా 60 వేల యువాన్లు. చైనా మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. హాంగ్జూకు చెందిన జూ అనే మహిళ 2011లో డాబర్మాన్ కుక్కను ఖరీదు చేసింది. దానికి జోకర్ అని పేరు పెట్టుకున్నది. జూ, జోకర్ మధ్య బంధం పెరిగింది. తొమ్మిదేళ్ల తర్వాత జోకర్‌కు మెడలో ట్యూమర్ కావడంతో సర్జరీ చేయించింది.
కానీ ఏడాది తర్వాత ఆ శునకానికి కొత్త సమస్యలు వచ్చేశాయి. దగ్గు, తుమ్ములతో పాటు గుండె సంబంధిత వ్యాధులు డెవలప్ అయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. 2022 నవంబర్‌లో జోకర్ కుక్క చనిపోయింది. దీంతో జూ గుండెపగిలింది. స్టడీస్ నుంచి కెరీర్ వరకు తనతో తోడున్న ఆ జోకర్‌ను మళ్లీ తన జీవితంలోకి తీసుకురావాలనుకున్న ఆ మహిళ క్లోనింగ్ కోసం వెళ్లింది.
క్లోనింగ్ ద్వారా శునకాలకు జీవం పోసే ఓ కేంద్రానికి ఆమె వెళ్లింది. వాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వడంతో క్లోనింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జోకర్ కుక్కకు చెందిన ఉదర చర్మం నుంచి చిన్న పీస్‌ను తీశారు. ఇంకా ఆ కుక్క చెవుల నుంచి కూడా కొంత భాగాన్ని తీసి క్లోనింగ్ చేశారు. జోకర్ కుక్క నుంచి తీసిన జన్యువులతో ఏడాది కాలంలోనే మరో శునకాన్ని పుట్టించారు.
కొత్తగా పుట్టిన కుక్క పిల్లకు లిటిల్ జోకర్ అని పేరు పెట్టిందామె. రెండింటికీ ముక్కు దగ్గర ఒకే రకమైన నల్ల స్పాట్ ఉన్నట్లు చెప్పింది. వాటి ప్రవర్తన కూడా ఒకేరకంగా ఉన్నట్లు తెలిపింది. చైనాలో జంతువుల క్లోనింగ్ చట్టపరమైంది. కానీ ఎథికల్ గైడ్‌లైన్స్ పాటించాల్సి ఉంటుంది. క్లోనింగ్ కంపెనీలకు కూడా అర్హత ముఖ్యమే.