బీజింగ్ : అంతరిక్ష పరిశోధనల తీరును మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించి చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించి, దానితో ఆక్సిజన్, ఇంధనానికి అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేయవచ్చు. దీంతో జీవించడానికి ముఖ్యమైన వనరులను భూమి నుంచి చంద్రునిపైకి రవాణా చేయవలసిన అవసరం తగ్గిపోతుంది. వ్యోమగాముల కోసం చిన్న పరిమాణంలో ఉన్న, వారిని బ్రతికించేందుకు అవసరమైన శరీర బాహ్య సదుపాయాలు కలిగిన వ్యవస్థల తయారీకి చంద్రునిలోని వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఈ పరిశోధన వెల్లడించింది.
చంద్రునిపైకి మానవుడు వెళ్లడానికి సవాలుగా మారిన పరిస్థితులను ఈ కొత్త టెక్నాలజీ పరిష్కరించవచ్చు. చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకుడు లూ వాంగ్ మాట్లాడుతూ, వ్యోమగాములు శ్వాస ద్వారా విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్, ఫ్యూయల్ ప్రీకర్సర్స్గా మార్చేందుకు కాంతిని ఉపయోగించే ప్రక్రియతో చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించడాన్ని అనుసంధానం చేయడమే గొప్ప విజయమని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుందన్నారు. ఈ విధానం వల్ల ఇంధన వినియోగ సమర్థత పెరుగుతుందని, లూనార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంక్లిష్టత తగ్గుతుందని తెలిపారు.
ప్రస్తుతం ఒక గ్యాలన్ నీటిని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి సుమారు రూ.69 లక్షలు ఖర్చవుతున్నది. చంద్రునిపై పరిశోధనలకు ఇదే పెద్ద అడ్డంకిగా ఉంది. చైనాకు చెందిన చాంగ్ ఈ-5 మిషన్ నుంచి వచ్చిన చంద్రుని మట్టిని విశ్లేషించినపుడు, నీటితో కూడిన ఖనిజాలు ఉన్నట్లు రుజువైంది. దీంతో భవిష్యత్తులో పరిశోధకులు ఈ వనరులను వినియోగించగలుగుతారనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. గతంలో చంద్రునిపై నీటిని సంగ్రహించే పద్ధతులు అత్యంత సంక్లిష్టంగా, అత్యధిక ఇంధనం అవసరమయ్యేవిగా ఉండేవి. కార్బన్‌డయాక్సైడ్‌ను ఇంధనంగా రీసైకిల్ చేయడంలో ఆ పద్ధతులు విఫలమయ్యాయి.