తియాంజిన్: షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మాట్లాడారు. గ్లోబల్ గవర్నెన్స్ ఇన్సియేటివ్(Global Governance Initiative) కోసం ఆయన ప్రతిపాదన చేశారు. చైనాలోని తియాంజిన్‌లో ఎస్సీవో సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పరిపాలనా వ్యవస్థను సమాంతరంగా చేసేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిన్‌పింగ్ తెలిపారు. మానవత్వ భవిష్యత్తు కోసం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. జీజీఐ ప్రతిపాదన కోసం ఆయన అయిదు సూత్రాలను తెలిపారు.
సార్వభౌమ సమానత్వం కోసం కట్టుబడి ఉండాలన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. బహుళ జాతీయ వాతాన్ని అనుసరించాలన్నారు. ప్రజా కేంద్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వాస్తవమైన చర్యలను తీసుకోవడంపై ఫోకస్ పెట్టాలని జీ జిన్‌పింగ్ అన్నారు.
గ్లోబల్ గవర్నెన్స్ అంశంలో చైనా చేసిన ప్రతిపాదనకు రష్యా మద్దతు తెలిపింది. పక్షపాతం లేనటువంటి ప్రపంచ సుపరిపాలనా వ్యవస్థను రూపొందించే అంశంలో చైనాకు అండగా నిలవనున్నట్లు రష్యా చెప్పింది. ఈ ప్రయత్నంలో చైనాకు సహకరించనున్నట్లు పుతిన్ తెలిపారు. ఎస్సీవో సమావేశాలకు ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారని, దీని ఆధారంగా అందరికీ నిజమైన ఆసక్తి ఉన్నట్లు అర్థమవుతోందని పుతిన్ పేర్కొన్నారు. 2001లో ఎస్సీవో ఏర్పాటు తర్వాత యురేసియన్ దేశాల్లో శాంతి, సామరస్యం వెల్లువిరిసిందన్నారు. గ్లోబల్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటులో ఎస్సీవో ముఖ్య భూమిక పోషిస్తుందని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.