బీజింగ్: కరోనా వైరస్ పుట్టిన చైనా ఆ మహమ్మారిని కట్టడి చేయానికి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదో నిదర్శనం. ఉత్తర చైనాలోని హార్బిన్ నగరంలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న మూడు పిల్లులకు కరోనా సోకగా.. వాటిని అక్కడి అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు ప్రత్యేక చికిత్సేమీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
వాటి వల్ల యజమానితోపాటు అపార్ట్మెంట్లోని ఇతరులకు కూడా ప్రమాదం ఉన్నదని వాళ్లు చెప్పారు. ఈ నెల 21న సదరు పిల్లులను పెంచుకుంటున్న యజమానికి కరోనా సోకింది. దీంతో ఆ వ్యక్తి పిల్లులకు కావాల్సిన ఆహారం, నీళ్లు వంటివి ఇచ్చి ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఓ కమ్యూనిటీ వర్కర్ వచ్చి ఆ పిల్లులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. రెండుసార్లు పాజిటివ్‌గా వచ్చాయి. అయినా తన పెంపుడు జంతువులను చంపొద్దని ఆ యజమాని అధికారులను వేడుకున్నారు.
ఆన్లైన్ ఉద్యమం కూడా నడిపారు. అయినా మంగళవారం రాత్రి స్థానిక అధికారులు వాటిని చంపేశారు. నిజానికి మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతుందని తేలినా.. జంతువుల నుంచి మనుషులకు ముప్పు వాటిల్లినట్లు ఇప్పటి వరకూ తేలలేదు. ఈ పిల్లులను కూడా చంపొద్దంటూ జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున ఆన్లైన్ ప్రచారం నిర్వహించారు. ఏకంగా 52 వేల మంది దీనిపై కామెంట్లు చేశారు.