వాషింగ్టన్: వుహాన్ సమీపంలో చైనా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉండగానే నీట మునిగిందని అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత భారీ నావికా దళాన్ని రూపొందిస్తున్న చైనాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. ఈ ఏడాది మే, జూన్ నెలల మధ్యలో ఆ జలాంతర్గామి మునిగిపోయినట్టు తెలుస్తున్నది.
ఉపగ్రహం తీసిన ఫొటోల్లో.. నీటి అడుగు నుంచి జలాంతర్గామిని పైకి లేపేందుకు అవసరమైన భారీ క్రేన్లు అక్కడ కనిపించాయని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఆ జలాంతర్గామిలో అణు ఇంధనం నింపారా లేక ఘటన జరిగినప్పుడు అందులోని న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తున్నదా అన్న విషయాలు వెల్లడి కాలేదు. అయితే జలాంతర్గామి మునిగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో రేడియేషన్ ప్రభావమేమీ లేదని వెల్లడైంది.