బ్యాంకాక్: దక్షిణ చైనా సముద్రంపై చైనా కవ్వింపు చర్యకు దిగింది. అమెరికాకు చెందిన బీ-52 బాంబర్ ఆకాశంలో ఎగురుతుండగా.. దానికి అత్యంత సమీపంగా చైనా యుద్ధ విమానం షెన్యాంగ్ జే-11 వేగంగా దూసుకొచ్చింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బీ-52కు పది అడుగుల సమీపానికి చైనా విమానం రావటంపై అమెరికా మిలటరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రెండు యుద్ధ విమానాలు ఢీకొనే పరిస్థితి తలెత్తింది’ అని యుఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ శుక్రవారం పేర్కొన్నది. ఈ తరహా ఘటన ఈ ఏడాది మేలో చోటుచేసుకుంది. అమెరికానే కవ్వింపు చర్యలకు దిగుతున్నదని, తమ దేశానికి కొన్ని మైళ్ల దూరంలో అమెరికా మిలటరీ విమానాలు బలప్రదర్శనకు దిగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో కృత్రిమ దీవుల్ని సృష్టిస్తూ.. సముద్ర జలాలపై తమకే హక్కు ఉందని చైనా చాలా ఏండ్లుగా వాదిస్తున్నది. ఈనేపథ్యంలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్.. తదితర దేశాలతో చైనాకు వివాదాలు నెలకొన్నాయి.